Lokesh: ఏ రైతును కదిలించినా కష్టాలు, కన్నీళ్లే..: లోకేశ్ - YCP leaders criticize Rajinikanth
Yuvagalam Padayatra: పాదయాత్రలో ఏ రైతును కదిలించినా కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తున్నాయని.. అకాల వర్షాలకు పంట దెబ్బతింటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో 86వ రోజు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఎమ్మిగనూరు శివారు క్యాంప్ సైట్ నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైంది. వర్షాలకు నష్టపోయిన రైతులను, గొర్రెల కాపరులను, వలస కూలీలను, స్థానిక ప్రజలను కలిసి... వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని పార్టీ లోకేశ్ హామీ ఇచ్చారు. రాళ్లదొడ్డిలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించి.. చేనేత కార్ముకుల సమస్యను తెలుసుకున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా చేనేత కార్మికులను బలోపేతం చేసే దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని లోకేశ్ హామీ ఇచ్చారు.
సంస్కారం ఉంటే రజినీకాంత్కు క్షమాపణలు చెప్పాలి..సూపర్ స్టార్ రజినీకాంత్ మీదకు ఊరకుక్కలను ఉసిగొల్పడానికి కారణం ఏంటో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలరా అని లోకేశ్ నిలదీశారు. జగన్ ఓ నేరగాడని.. సీఎంగా ఆయన పరిపాలన అధ్వానంగా ఉందనే విమర్శలేవీ రజినీకాంత్ చేయలేదుగా అని ప్రశ్నించారు. చంద్రబాబు గురించి తనకు తెలిసింది మాట్లాడితే ఎందుకు చెమట్లు పట్టాయని నిలదీశారు. సంస్కారం అనేది ఉంటే ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.