MRI Scan For Lokesh: కుడి భుజం నొప్పితో బాధపడుతున్న లోకేశ్.. నంద్యాలలో ఎంఆర్‌ఐ స్కాన్ - లోకేశ్‌కు ఎంఆర్‌ఐ స్కాన్
MRI Scan For Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇటీవలె పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న నారా లోకేశ్.. నేడు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నంద్యాలలోని మ్యాగ్న ఎంఆర్‌ఐ సెంటర్‌లో ఆయన కుడి భుజానికి స్కానింగ్ చేశారు. 50 రోజులుగా నొప్పితో బాధపడుతూనే ఆయన పాదయాత్ర కొనసాగించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల సూచన మేరకు నంద్యాలలో లోకేశ్ కుడి భుజానికి ఎంఆర్‌ఐ స్కానింగ్ చేశారు.
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంగా భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో నారా లోకేశ్ కుడి భుజానికి గాయమైంది. ఫిజియో థెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకున్నా నొప్పి తగ్గలేదు. అలాగే ఉరవకొండ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో కూడేరులో క్రేన్ నుంచి భారీ గజమాల తెగి లోకేశ్ కుడి భుజంపై పడింది. దీంతో ఒక్కసారిగా వేలాది మంది అభిమానులు లోకేశ్ వద్దకు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. తృటిలో ప్రమాదం తప్పడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అదే నొప్పి ఇంకా ఎక్కువ అయిన పట్టువదలకుండా లోకేశ్ పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. తాజాగా వైద్యుల సూచన మేరకు నేడు నంద్యాలలో ఎంఆర్‌ఐ స్కానింగ్ తీయించుకున్నారు.