కర్నూలు జిల్లాలో నిజం గెలవాలి యాత్ర - పలు కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శ - భువనేశ్వరి పర్యటన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 10, 2024, 2:12 PM IST
Nara Bhuvaneshwari Kurnool Tour: తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై మరణించిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఆమె కర్నూలు జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. కర్నూలు జిల్లా నందవరం మండలం మాచాపురం, ముగతి గ్రామాల్లో పర్యటించిన భువనేశ్వరి మరణించిన వారి కుటుంబాలను ఓదార్చారు. పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. ఇరు కుటుంబాలకు మూడు లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. నందవరం మండలంలోని మాచాపురానికి చెందిన హనుమంతు, చంద్రబాబు అక్రమ అరెస్టుతో గుండెపగిలి ప్రాణాలు విడిచారు. అంతేకాకుండా ముగతికి చెందిన నాగరాజు చంద్రబాబు అక్రమ అరెస్టు తట్టుకోలేక ప్రాణాలు విడిచాడు. ఈ క్రమంలోనే వారి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శించారు.
కర్నూలు జిల్లాలో ఆమె మొదటి రోజున భువనేశ్వరి మంత్రాలయం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ యాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. భువనేశ్వరి పర్యటనకు టీడీపీ అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. టీడీపీ మహిళ నాయకులు ఆమె రాకకు స్వాగతం పలుకుతూ హరతులు ఇస్తున్నారు.