Farmer Padayatra: 70ఏళ్ల రైతు.. అమరావతికి మద్దతుగా.. 300కిలోమీటర్ల పాదయాత్ర - చినదేవలాపురం
Nandyala Farmer Padayatra: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులందరూ దీక్షా శిబిరాల్లో నిరసనలు చేస్తున్నారు. తమకు అమరావతినే రాజధాని చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్నో రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. వాగ్వాదాలు, తోపులాటలు, పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తిన్నా.. ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అయితే అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి చలించిన ఓ రైతు పాదయాత్ర చేపట్టగా.. అది విజయవంతంగా ముగిసింది.
నంద్యాల జిల్లా చినదేవలాపురానికి చెందిన చింతల నారాయణ అనే రైతు చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా పూర్తి అయ్యింది. 70 ఏళ్ల వయసులో.. మండుటెండనూ లెక్కచేయకుండా సుమారు 300 కిలోమీటర్లు నడిచిన ఆయన.. ఆదివారం తుళ్లూరు చేరుకున్నారు. ఈ నెల 3న చినదేవలాపురంలో పాదయాత్ర ప్రారంభించి.. ఆదివారం రాత్రి గుంటూరు జిల్లా తుళ్లూరు దీక్షా శిబిరానికి.. చింతల నారాయణ చేరుకున్నారు. రైతులు, మహిళలు, తుళ్లూరు మండలం తెలుగుదేశం నాయకులు.. ఆయన్ని ఘనంగా సత్కరించారు. ఇటీవల పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగిన సందర్భంలో.. మహిళలు గాయపడి కన్నీరు పెట్టుకోవడం చూసి మనసు చలించి.. పాదయాత్ర చేశానన్నారు. మార్గమధ్యలో తనను ఇద్దరు అడ్డగించి బెదిరించారని తెలిపారు.