villagers questioned MLA: "పని చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు..?" : ఎమ్మెల్యేని నిలదీసిన గ్రామస్తులు
The villagers questioned the MLA: ఎన్నికల ప్రచారంలో ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నాయకులు.. తీరా వాటిని నెరవేర్చకపోవడంతో ప్రజాక్షేత్రంలో అవమానాలు ఎదుర్కొంటున్నారు. సమస్యలను పట్టించుకోకుండా ప్రజల మధ్యకు వెళ్లిన నేతలు.. తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నారు. హామీలు నెరవేర్చకుండా ఓటు కోసం మళ్లీ ఎందుకు వచ్చారంటా గ్రామాల్లో మహిళలు నిలదీస్తున్నారు. డ్రైనేజీ ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారంటూ నంద్యాల జిల్లా గొస్పాడు మండలం చింతకుంట గ్రామస్తులు మండిపడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డిని నిలదీశారు. ఎన్ని సార్లు వచ్చినా వేస్తామనే మాట చెబుతున్నారు తప్ప నీళ్లు వెళ్లేలా కాల్వ మాత్రం తీయడం లేదంటూ మహిళలు మండిపడ్డారు. ఈసారి పని చేయిస్తేనే ఓటు వేస్తామని తేల్చి చెప్పారు. గ్రామ మహిళలు ఊహించని విధంగా నిలదీయడంతో ఎమ్మెల్యే.. కొద్ది సేపు మౌనం దాల్చారు. ఆయన అనుచరులే ప్రతిస్పందించగా.. మహిళలు మరింత గట్టిగా నిలదీశారు. చివరికి ఎమ్మెల్యే శిల్పా స్పందించి పని చేయిస్తామని చెప్పి వెళ్లిపోయారు.