Ward Councilor: "పనుల కోసం ఎవరి కాళ్లైనా పట్టుకుంటా.. రాజీనామా చేయమంటే చేస్తా" - today live news telugu
Nandhyala Ward Councilor: తన వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులు జరగటం లేదని.. నంద్యాలలోని అధికార పార్టీ వార్డు కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వార్డు అభివృద్ధికి నోచుకోలేదని.. అభివృద్ధి కోసం రాజీనామా చేయమంటే చేస్తానని అన్నారు. అభివృద్ధి జరగాలంటే ఎవరి కాళ్లు పట్టుకోవాలో చెేప్తే వారి కాళ్లైనా సరే పట్టుకుంటానని ఆందోళన వ్యక్తం చేశారు.
నంద్యాల పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహించగా.. అధికార పార్టీకి చెందిన 25వ వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్ సమావేశంలో తన గోడు తెలిపాడు. కౌన్సిల్ ఏర్పాటై రెండు సవంత్సరాలు పూర్తి కావస్తోందని.. అయినా తన వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కౌన్సిల్ సమావేశంలో ఛైర్ పర్సన్‌ను ప్రశ్నించారు. అభివృద్ధి లేకపోవటం దురదృష్టకరమని వాపోయారు. వార్డులో ఎలాంటి అభివృద్ధి లేదని.. ప్రజలు తనని ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గతంలో కూడా కౌన్సిల్‌కు ఎన్నికయ్యానని.. ఏనాడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని తెలిపారు. ఈ విధంగా ఉంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలమని ఆవేదన వ్యక్తం చేశారు.