Nandhyala MP: మహిళపై నంద్యాల ఎంపీ బంధువుల దాడి.. ఐదెకరాల పంట ధ్వంసం - నంద్యాలలో పంట ధ్వంసం
Nandhyala MP Relatives Attack on Woman: నంద్యాల ఎంపీ బంధువు ఓ మహిళపై దాడి చేసి.. ఆమె కౌలుకు సాగు చేస్తున్న పంటపొలాన్ని ధ్వంసం చేసిన ఘటన నంద్యాల జిల్లాలో కలకలం రేపింది. కౌలుకు చెల్లించాల్సిన నగదును బాకీ లేకుండా చెల్లించమని ఐదెకరాల పంట పొలాన్ని ధ్వంసం చేశారు.
అసలేం జరిగిందంటే..నంద్యాల మండలం వెంకటేశ్వరపురం గ్రామానికి శేషన్న, అంకాలమ్మ దంపతులు.. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఐదు ఎకరాల పొలాన్ని గత కొన్ని సంవత్సరాలుగా కౌలుకు సాగు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం అందులో మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఈ సంవత్సరం చెల్లించాల్సిన కౌలును నగదులో ముందుగా 50వేలు చెల్లించినట్లు అంకాలమ్మ తెలిపింది. మిగతా మొత్తం కొన్ని రోజుల తర్వాత చెల్లిస్తామని చెప్పినట్లు వివరించింది. దీంతో మిగిలిన కౌలు నగదును కూడా చెల్లించాలని ఎంపీ బంధువులు.. ట్రాక్టరుతో మొక్కజొన్న పంటను దున్నినట్లు బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. ప్రశ్నించినందుకు తనపై కూడా దాడి చేసినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దాడిలో గాయపడిన బాధితురాలు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.