Naga Chaitanya in Srikakulam: మత్స్యకార గ్రామంలో నాగచైతన్య సందడి.. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో సినిమా.. - Naga Chaitanya interaction with fishermen
Naga Chaitanya in Srikakulam: హీరో నాగచైతన్య తన తరువాత సినిమాకు సిద్ధమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కె మత్స్యలేశం మత్స్యకార గ్రామంలో నాగచైతన్య పర్యటించారు. 2018లో శ్రీకాకుళం చెందిన 21 మంది మత్స్యకారులు గుజరాత్ ప్రాంతం నుంచి చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి.. రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన వృత్తాంతం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నామని నాగచైతన్య తెలిపారు. మత్స్యకారులు వలసలు వెళ్లి ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో అని.. పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించిన మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు. దర్శకుడు చందూ మొండేటితో తీయబోయే తన తరువాత సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు.. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయని నాగచైతన్య తెలిపారు. నిజ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా కాబట్టి.. ప్రతి అంశం తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చామని దర్శకుడు చందు మొండేటి తెలిపారు. నాగచైతన్య రాకతో కె.మత్స్యలేశం గ్రామంలో సందడి నెలకొంది. విషయం తెలుసుకున్న అభిమానులు చుట్టుపక్కల గ్రామాలు నుంచి భారీగా చేరుకున్నారు.