Nadu-Nedu Works Speed Up: పార్వతీపురం జిల్లాలో రాత్రికి రాత్రే నాడు-నేడు పనులు.. - సీఎం జగన్ పర్యటనకు పార్వతీపురంలో ఏర్పాట్లు
Nadu-Nedu Works Speed Up: విద్యాసంవత్సరం ప్రారంభమై ఇన్నాళ్లు గడుస్తున్నా.. నాడు-నేడు పనులను పూర్తిచేయని అధికారులు.. సీఎం పర్యటన అనేసరికి హడావుడిగా పనులను ముమ్మరం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాత్రికి రాత్రే.. 'నాడు-నేడు' కార్యక్రమంలో భాగంగా మరమ్మతు పనులను చేపట్టారు. నాడు-నేడు పనుల సంబంధిత నిధులు ప్రిన్సిపల్ ఖాతాలో ఎప్పుడో జమైనా.. అధికారులు మాత్రం ఇన్నాళ్లు పనుల్లో జాప్యం చేశారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి పార్వతీపురం జిల్లాలో పర్యటించనున్నారనే నేపథ్యంలో కిటికీల ఏర్పాటు, మరమ్మతు పనులను.. కళాశాల సిబ్బంది దగ్గరుండి మరీ.. రాత్రి వేళల్లో చేయించారు. దీనిపై మన్యం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారిణి మంజులవీణ వద్ద ప్రస్తావించగా.. సీఎం జగన్ పర్యటన ఉండటంతో అత్యవసరంగా సంబంధిత పనులు వేగవంతం చేసినట్లు వివరించారు. నాడు-నేడు విభాగం రాష్ట్ర కమిషనర్ కాటంనేని భాస్కర్.. జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, డీఈవో ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.