Nadendla Manohar Met with Janasena Leaders: టీడీపీ - జనసేన ఉమ్మడి కార్యచరణ సిద్ధమవుతోంది.. సమస్యలపై కలసి పోరాడదాం: నాదెండ్ల
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2023, 9:19 AM IST
Nadendla Manohar met with Janasena leaders : తెలుగుదేశం పార్టీ నాయకులతో పొరపొచ్చాలు రాకుండా సమన్వయం చేసుకుని ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించాలని జనసేన నేతలకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. త్వరలోనే టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యచరణ సిద్ధమవుతుందని, అప్పటి వరకు పార్టీ నియమావళికి లోబడి ముందుకెళ్లాలన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర (Varahi yatra) నాలుగో విడత కార్యక్రమంపై చర్చించేందుకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశంతో కలసి రాబోయే ఎన్నికల్లో పోటీ, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, పార్టీ సంస్థాగత అంశాలపైనా చర్చ జరిగింది. టీడీపీతో పొత్తు నిర్ణయాన్నిసమర్థిస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్రస్థాయి నాయకులతో పాటు జిల్లా, నగర అధ్యక్షులు స్వాగతించారు.
Nadendla Manohar Comments on TDP Janasena Party Alliance :వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రాబోయే ఎన్నికల్లో జనసేన-తెలుగుదేశం పార్టీలు కలసి పోటీ చేయాలన్న పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయానికి ఈ సమావేశం ఆమోదం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. త్వరలోనే రెండు పార్టీల ముఖ్య నాయకులు చర్చించుకుని ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం చేస్తున్న ఆందోళనలకు జనసేన మద్దతు విషయంలో దిశానిర్దేశం చేశారు. ఉమ్మడిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే స్థానికంగా ఉండే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ సంస్థాగత నిర్వహణ విషయంలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
Varahi yatra Starts at Avanigadda on 1st October :అక్టోబర్ 1వ తేదీన కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి యాత్ర ప్రారంభం అవుతుందని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటి వరకూ జరిగిన యాత్ర ఏ స్థాయిలో విజయవంతమైందో.. అంతకు మించి నాలుగో విడత కార్యక్రమం జయప్రదం చేయాలని సూచించారు. పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు మనస్ఫూర్తిగా కృషి చేయాలని మనోహర్ కోరారు.