'జగన్ ప్రభుత్వానికి రైతులను పట్టించుకునే తీరిక లేదు - 361 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలి'
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 5:29 PM IST
Nadendla Manohar Inspected Dried Crops: సాగునీటి కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నా.. వారిని పట్టించుకునే తీరిక జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదని.. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. టీడీపీ-జనసేన భేటీలో రైతు సమస్యలపై చర్చిస్తామన్నారు. రైతులకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని రైతులకు ఆయన హామీ ఇచ్చారు.
Nadendla Manohar Comments: గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని హాఫ్‌పేట, తంగెళ్లమూడి, కొలకలూరు గ్రామాల్లో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ఎండిన వరి పొలాల పరిశీలించారు. అనంతరం దెబ్బతిన్న వరి పొలాలు, సాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..''ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రైతులను పట్టించుకునే తీరిక లేదు. రైతులకు సాగునీరు అందించటంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.సాగునీటి కోసం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి గుంటూరులో ఒక్క కరవు మండలం లేదని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 361 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలని జనసేన తరుఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు అండగా అన్ని జిల్లాలో ఉద్యమిస్తాం. రోజూ ఏదో ఒక బటన్ నొక్కే ముఖ్యమంత్రి జగన్.. రైతుల ఇంజన్ల బటన్ కూడా నొక్కాలి'' అని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.