Murder Under Influence of Ganja: గంజాయి మత్తు.. కొట్టుకున్న యాచకులు.. ఒకరు మృతి - పాడేరు లేటెస్ట్ న్యూస్
Murder Under Influence of Ganja: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నడిబొడ్డున ఐటీడీఏ సమీపంలో ఓ యాచకుడి హత్య స్థానికులను భయకంపితులను చేసింది. ఇద్దరి యాచకుల మధ్య జరిగిన వివాదం హత్యకు దారి తీసింది. సోమవారం సాయంత్రం వీరిద్దరూ ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద కొట్టుకుంటూ స్థానికులకు కనిపించారు. ఇది చూసిన కొందరు వారిని మందలించారు. అయినా కూడా వారు ఎవరి మాటా వినకుండా కొట్టుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో పీఎంఆర్సీ వెళ్లే రహదారిలో ఒక యాచకుడు ఇనుప ఆయుధంతో మరో భిక్షాటకుడిని హత్య చేశాడు. నిందితుడు గంజాయి మత్తులో ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం.. నిందితుడు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సుధాకర్ తెలిపారు. కాగా.. యాచకుల ముసుగులో వీరంతా గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ప్రస్తుతం పోలీసులు.. భిక్షాటకుల ముసుగులో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నవారిని గుర్తించే పనిలో ఉన్నారు.