Murder in Eluru District: ఏలూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు - చేబ్రోలు పోలీసులు
Murder in Eluru District: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో కురిపాటి చంద్రశేఖర్ (39) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన చంద్రశేఖర్ కు అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరితో వివాహమైంది. చంద్రశేఖర్ నారాయణపురంలోని టైల్స్ పరిశ్రమలో పనిచేస్తూ స్థానికంగా భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున భువనేశ్వరి తన భర్తను ఎవరో చంపేశారని ఇంటి యజమానితో చెప్పింది.
సమాచారం అందుకున్న నిడమర్రు సీఐ మోగంటి వెంకట సుభాష్, చేబ్రోలు ఎస్ఐ స్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి మెడమీద పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచినట్లు తీవ్ర గాయాలు ఉన్నాయి. మృతుడి భార్యకు తాడేపల్లిగూడెంకిి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రియుడితో కలిసి తన భర్తను హతమార్చి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేఖర్ భార్య భువనేశ్వరిని చేబ్రోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.