Muppalla Nageswara Rao: సీఎం ఇక్కడే ఉంటూ.. అమరావతిని ధ్వంసం చేస్తున్నారు: ముప్పాళ్ల - ఈ రోజు వార్తలు Live
Muppalla Nageswara Rao: కంచె చేను మేసిన చందంగా సీఎం జగన్ అమరావతిలో ఉంటూ.. అమరావతినే ధ్వంసం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల లక్ష్యాన్ని దెబ్బతీసేందుకే ప్రభుత్వం సెంటు స్థలం జపం చేస్తోందని మండిపడ్డారు. సెంటు స్థలంలో పేదలు ఎలాంటి ఇళ్లు నిర్మించుకోవాలో ముఖ్యమంత్రి తెలపాలని ప్రశ్నించారు. కేవలం రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి ఈ ఎత్తుగడ వేశారన్నారు.
పట్టణాలలో రెండు సెంట్లు.. గ్రామాలలో కనీసం మూడు సెంట్లు నివాసయోగ్యమైన స్థలం ఇవ్వాలని ముప్పాళ్ల డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఇంటి వైశాల్యం ఎంతో..పేదల ఇళ్లను ఎంత స్థలంలో నిర్మిస్తున్నారో చెప్పాలన్నారు. రైతుల పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాజధానిలో పేదల కోసం గత ప్రభుత్వం 5వేల ఇళ్లు నిర్మించిందని పేర్కొన్నారు. పేదలకు పంపిణీ చేయకుండా ప్రభుత్వం వాటిని నాశనం చేస్తోందని విమర్శించారు. ముందుగా వాటిని లబ్దిదారులకు అందజేయాలని.. ఆ తర్వాత ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.