వీసీని బర్త్‌రఫ్ చేయాలి - ఆచార్య నాగార్జున వర్సిటీ వద్ద ఎమ్మార్పీఎస్ నాయకుల ఆందోళన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2024, 5:53 PM IST
MRPS Leaders Agitation: గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున వర్సిటీలో మాదిగ విద్యార్థి సమాఖ్య జాతీయ సభ నిర్వహించేందుకు అనుమతివ్వాలంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. కాజా టోల్ గేట్ నుంచి ఆచార్య విశ్వవిద్యాలయం వరకు ఎమ్మార్పీఎస్ నేతలు ర్యాలీగా వచ్చి ఆందోళన చేశారు. మాదిగలకు వ్యతిరేకంగా ఉన్న వర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్‌ను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకుల ఆందోళనతో యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వర్సిటీ వద్ద 4 వందల మంది పోలీస్ బలగాలు మోహరించి వారిని అడ్డుకున్నారు.
పోలీసులకు, ఎమ్మార్పీఎస్ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విశ్వవిద్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మార్పీఎస్ నేతలను పోలీసులు అడ్డగించారు. వీసీ రాజశేఖర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పదిమంది ఎమ్మార్పీఎస్ నేతలను వీసీతో చర్చించేందుకు అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పారు. ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు లోపలికి అనుమతించడంతో వీసీకి వినతి పత్రం అందించారు. అయితే వీసీ అనుమతి ఇచ్చేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ నేతలు హెచ్చరించారు.