MP MVV Fired on Pawan Kalyan విశాఖపట్నంలో నిర్మాణాలు చేస్తూ.. అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నా: పవన్‌పై ఎంపీ ఎంవీవీ ధ్వజం - వైసీపీ
MP MVV Fired on Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఆరోపించినట్లుగా తమ సంస్థ నిర్మిస్తున్న భవనం వద్ద ఎలాంటి ప్రభుత్వ స్థలం లేదని, నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో స్టేటస్ కో ఉంటే నిరూపించాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సవాలు విసిరారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ డి సర్వే నంబర్ 75/1 75/5 లో స్థలం చర్చికి సంబంధించిందని, తమ సంస్థ చేపట్టిన నిర్మాణం 75/3 సర్వే లో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కల్యాణ్ పై పలు వ్యక్తిగత ఆరోపణలు, మాటల దాడి చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావంటూ ప్రారంభించి... అసలు మీ కులానికి ఏం చేయాలనుకుంటున్నావు అని ప్రశ్నించారు. నీకన్నా కేఏ పాల్ వెయ్యి రెట్లు బెటర్.. ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు నా గురించి మాట్లాడతావా అని నిలదీశారు. విశాఖపట్నం అభివృద్ధిలో తన పాత్ర ఉందన్న ఎంపీ.. అనేక నిర్మాణాలు చేసి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నానన్నారు. పవన్‌కి దమ్ము, ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. అసలు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నావో దమ్ముంటే చెప్పు.. స్పీచ్‌లలో అరుపులు, కేకలు, అంతా యాక్టింగ్ తప్ప ఏముందని ప్రశ్నించారు. పెళ్లిళ్లు, పిల్లల గురించి కూడా ఎంవీవీ పలు అంశాలను ప్రస్తావించారు. నేరస్థులకు తాను కొమ్ము కాస్తున్నానని చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. చట్టం చేతుల్లోకి తీసుకోలేమని, న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.