రోడ్డు ప్రారంభోత్సవంలో టీడీపీ ఎంపీ, వైసీపీ ఎమ్మెల్యే - మారుమ్రోగిన ఇరు పార్టీల నినాదాలు - MPKesineniNanicomments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 5:29 PM IST
MP Kesineni Nani Participates in Road Inauguration :ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌తో కలిసి రహదారిని ప్రారంభించారు. 2.95 కోట్లతో కొత్త రెడ్డిగూడెం నుండి కూనపరాజుపర్వ వెళ్లే రహదారి అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY-III) నిధులతో 5 కిలోమీటర్ల పొడవునా రహదారి నిర్మించారు.
పీఎంజీఎస్‌వై నిధులతో చేపట్టిన రోడ్డు పనులు కావడంతో ఎంపీ కేశినేని నాని కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. రహదారి ప్రారంభ కార్యక్రమానికి ఎంపీ కేశినేని నానితో పాటు తెలుగుదేశం కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అప్పటికే వైఎస్సార్సీపీ కార్యకర్తలు వేదిక వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన పక్షాలు ఎదురెదురు పడ్డాయి. ఇరువర్గాలు తమ తమ పార్టీ జెండాలు ఎగురవేస్తూ తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసుల ఆపసోపాలు పడ్డాల్సి వచ్చింది. ఈ గందరగోళం మధ్యే ఎమ్మెల్యే వసంత, ఎంపీ కేశినేని నాని రహదారి ప్రారంభ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.