MP Keshineni Nani's complaint to PM Modi: 'చంద్రబాబుపై దాడి హేయం'.. ప్రధాని మోదీకి ఎంపీ కేశినేని లేఖ - ఏపీ ముఖ్యవార్తలు
MP Keshineni Nani's complaint to PM Modi: రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని, ఆ విషయాన్ని ప్రధాని మోదీకి లేఖ రూపంలో ఫిర్యాదు చేస్తానని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. పుంగనూరులో చంద్రబాబుపై దాడి చేయటం హేయమన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాను తిరిగి అధికారంలోకి వస్తానని చెబుతున్నాడని, తిరిగి అధికారంలోకి వచ్చే వారెవ్వరూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేయరన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను, సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశ్యం ఉండాలి తప్పితే దాడులకు పాల్పడకూడదన్నారు. వైసీపీ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో ఆ పార్టీ నాయకులలో స్థైర్యం పోయి దుర్మార్గాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. వైసీపీ నాయకులేమీ రాజులు, మారాజులు, సామంత రాజులు కాదన్నారు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 45 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నారని వెల్లడించారు. 1983 ముందు హైదరాబాద్‌లో గొడవలు జరిగేవని, ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నట్లుగానే ఉండేవన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంతి భద్రతలను మెరుగుపరిచారని.. ఆ తర్వాత హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. శాంతి, భద్రతలు లేకపోతే ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదన్నారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ వాళ్లే ప్రొత్సహించారని, ఇప్పుడు వాళ్లే బలవుతున్నారని పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లకు ప్రజల సొమ్ముతో జీతాలు ఇస్తున్నారని, వారు ప్రజాసేవకులుగా ఉండాలి తప్పితే పాలకుల సేవకులుగా ఉండకూడదన్నారు.