Modumudi Sudhakar Honored: స్వర్ణ కంకణంతో గురువుని సత్కరించిన శిష్యులు.. - ఎన్టీఆర్ జిల్లా లేటెస్ట్ న్యూస్
Modumudi Sudhakar Honored with Gold Bracelet: సంగీతంలో ఉత్తమ శిక్షణ అందించిన గురువు మోదుమూడి సుధాకర్‌ను వారి శిష్యులు స్వర్ణకంకణంతో సత్కరించారు. విజయవాడ లబ్బిపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో కళారత్న.. నాదకళా విశారదగా పేరు పొందిన మోదుమూడి సుధాకర్.. షష్యబ్ధి ఉత్సవాల్లో భాగంగా.. ఆయన శిష్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా విదేశాల్లోని శిష్యులు సైతం ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. సంగీతంలో 50 ఏళ్లుగా తన వంతు సేవ చేస్తోన్న సుధాకర్ దంపతులను ఊరేగించి.. గజమాలతో సత్కరించారు. విద్యా వారసులుగా శిష్యులను తయారు చేయడంలో మోదుమూడి సుధాకర్ కనబరిచిన శ్రద్ధాశక్తులను ఈ సందర్భంగా శిష్యులు గుర్తు చేసుకుంటూ.. గురువు కీర్తి ప్రతిష్ఠలను మరింత ఇనుమడింపజేశారు. సంగీతంలో సద్గురువు త్యాగరాజస్వామి గురుపరంపరంలో ఆరో తరనికి చెందిన సద్గురువుగా మోదుమూడి సుధాకర్‌ను కొనియాడారు. ఈ సన్మాన మహోత్సవాన్ని పురస్కరించుకుని 3 రోజులుగా శిష్యులు సంగీత కచేరీలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, విశాఖ గాయత్రి విద్యా పరిషత్తు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టరు పేరాల బాలమురళీకృష్ణ తదితరులు హాజరయ్యారు. శిష్యులు తనపై గురుభక్తిని చాటుకోవడం పట్ల మోదుమూడి సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు.