MLC Ramgopal Reddy comments on Jagan: జగన్ పాలనను.. రెడ్డి వర్గమూ అసహ్యించుకుంటోంది : ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి - చంద్రబాబుపై అక్రమ కేసులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2023, 7:20 PM IST
MLC Ramgopal Reddy's comments on Jagan :రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూసి రెడ్డి సామాజిక వర్గ ప్రజలూ బాధపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అరెస్టు, కేసులకు వ్యతిరేకంగా శ్రీ సత్యసాయి జిల్లా సీకేపల్లిలో.. రెడ్డి సామాజిక వర్గం ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు రాం గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల శ్రీరామ్‌తో పాటు జనసేన నేతలు పాల్గొన్నారు.
దీక్షలో పాల్గొన్న ప్రజలకు మాజీమంత్రి పరిటాల సునీత ధన్యవాదాలు తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని, ప్రతిపక్షాల ఆనవాళ్లు లేకుండా చేయాలని జగన్ అనుకుంటున్నారని ఎమ్మెల్సీ రాం గోపాల్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన టీడీపీ శ్రేణులు భయపడరని స్పష్టం చేశారు. ఇంకా రెట్టింపు పట్టుదలతో పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించి.. టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి దుర్మార్గపు పాలన గతంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చూడలేదన్నారు. రానున్న ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం టీడీపీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.