MLC Ashok Babu: "ఉద్యోగుల బకాయిల్ని రాబోయే ప్రభుత్వం చెల్లిస్తుందనడం సరైందా..?' - ఉద్యోగుల సమస్యలపై ఆశోక్ బాబు
MLC Ashok Babu on Employees Problems : కేబినెట్ నిర్ణయాల ద్వారా ఉద్యోగుల డిమాండ్లు పరిష్కారమయ్యాయని అంటున్న బండి శ్రీనివాస్.. ఆ డిమాండ్లు ఎంటో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ ఆశోక్‌బాబు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన 7 వేల కోట్ల రూపాయలను.. సంవత్సరానికి నాలుగు విడతల చొప్పున 2027 వరకు చెల్లిస్తామని అనటానికి ప్రభుత్వానికి సిగ్గుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల బకాయిల్ని రాబోయే ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి తప్పించుకోవటం ఎంత వరకు సరైందని నిలదీశారు. ఐదు సంవత్సరాలు నిండిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే లబ్ధి కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. మిగిలిన ఉద్యోగులు ఏమై పోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ వల్ల ఉద్యోగులకు ఒరిగేందేమిటని ప్రశ్నించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం వేసిన 11వ పీఆర్సీ కమిషన్ నివేదికను.. ఈ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదో సమాధానం ఇవ్వాలన్నారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు 70వేల కోట్లు ఖర్చుపెడుతున్నట్టు సాక్షి మీడియా ఎందుకు నెగిటివ్‌గా ప్రచారం చేస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల్ని ఓటు బ్యాంక్‌గా చూసినంత కాలం వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించదని విమర్శించారు. సీపీఎస్ రద్దు చేస్తానన్న హామీని నిలబెట్టుకోలేని అసమర్థతను అంగీకరిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.