MLA Sudhakar's PA Scams: సంతనూతలపాడు ఎమ్మెల్యే పీఏ టోకరా.. ఉద్యోగాల పేరుతో 6.5 లక్షలు వసూలు - ఎమ్మెల్యే సుధాకర్ పీఏపై ఫిర్యాదు
MLA Sudhakar PA Fraud They Will Give Jobs: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు వద్ద పీఏగా పని చేస్తున్న బండారు సురేష్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తమ వద్ద ఆరున్నర లక్షలు వసూలు చేసి మోసం చేశారని బల్లికురవ మండలానికి చెందిన పుల్లారావు, అశోక్ కుమార్, అనిల్ అనే వ్యక్తులు కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా నగదు తిరిగి ఇవ్వాలని అడిగితే.. దిక్కున్న చోట చెప్పుకోండి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందనలో కలెక్టర్‌కి ఫిర్యాదు చేస్తే.. ఎస్పీని కలవమని చెబుతున్నారని చెప్పారు. దీంతో ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నామని బాధితులు వాపోయారు. బండారు సురేష్ తమను త్రిబుల్ ఐటీలో ఒకరికి, నీటిపారుదల శాఖలో మరొకరికి, రెవెన్యూ శాఖలో ఒకరికి ఉద్యోగాలు ఇస్తామని నమ్మించారని వీరు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగం రాక, అప్పుకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే పీఏపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత యువకులు ప్రభుత్వాన్ని కోరారు.