MLA Sivakumar with Student అన్నన్నా.. ఎమ్మెల్యే అన్నాబత్తుని మాటలు విన్నారా! అవాక్కైన లబ్ధిదారులు..! - అన్నాబత్తుని శివకుమార్ నిర్వాకంపై విమర్శలు
You Need House Land or Need Certificates : ప్రభుత్వం ఫీజ్ రీఎంబర్స్ మెంట్ బకాయిలు పెట్టిన కారణంగా తాను ఉద్యోగానికి దూరమయ్యానని గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన నాగలక్ష్మి వాపోయారు. గుంటూరులోని ఓ కాలేజిలో తాను ఎం.ఫార్మసి చేశానని.. ఫీజు చెల్లించలేదని కాలేజి యాజమాన్యం రెండేళ్లుగా సర్టిఫికెట్లు ఇవ్వలేదని తెలిపారు. 'గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం'లో భాగంగా తమ ఇంటికి వచ్చిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు ఈ విషయంపై చెప్పగా ఆయన పట్టించుకోలేదని వాపోయారు. తన సమస్యను పట్టించుకోకుండా ప్రభుత్వం తమ కుటుంబానికి ఇంటిస్థలం ఇచ్చింది కదా అనంటంతో ఒకింత గందరగోళానికి గురైనట్లు తెలిపారు. 'ఇంటి స్థలం కావాలా.. సర్టిఫికెట్లు కావాలా' అని ఎమ్మెల్యే ప్రశ్నించడంతో అవాక్కైనట్లు నాగలక్ష్మి తెలిపారు. ఎంతో కష్టపడి చదివానని.. సర్టిఫికెట్లు ఉంటే తనకు ఏదైనా ఉద్యోగం వస్తుందన్నారు. అందుకే తానకి సర్టిఫికెట్లు ముఖ్యమని చెబితే.. ఇంటి పట్టా రద్దు చేయమని ఎమ్మెల్యే శివకుమార్ చెప్పటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లపై ఎలాంటి హామీ ఇవ్వకుండా ఎమ్మెల్యే శివకుమార్ వెనక్కు వెళ్లారు. తమకు అర్హత ఉంది కాబట్టి ఇంటి స్థలం వచ్చిందని.. అలాగే జీవనోపాధికి సర్టిఫికెట్లు కూడా ముఖ్యమేనని నాగలక్ష్మి తెలిపారు. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజులు బకాయి పెట్టడంతో సర్టిఫికెట్లు రాక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వెలిబుచ్చారు.