Fishermen Vs YCP leaders: మాకు ఏం చేశారన్న మత్స్యకారులు.. వైసీపీ శ్రేణుల వీరంగం - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి నిరసన
MLA Pratap Kumar Reddy Followers Rowdyism on Fishermen: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఆదివారం నిర్వహించిన మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలకు చుక్కెదురైంది. ఎమ్మెల్యే సొంత కల్యాణ మండపంలో మత్స్యకారులతో వారు సమ్మేళనం నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఘనతను హాజరైన పలువురు గ్రామాల నాయకులు వివరించారు. వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుందని అంటూ ఎంపీ బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కొందరు మత్స్యకారులు వారి ప్రసంగానికి అడ్డు తగిలారు. తమకి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటూ నాయకులను ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో మాదిరి ప్రస్తుతం ప్రయోజనాలు ఇవ్వటం లేదని తప్పుబట్టారు. రాయితీ ధరలకు వలలు, ఇంజిన్లు, పడవలు తదితరాల ఊసే లేదంటూ ఏకరవు పెట్టారు. దీంతో వారిని పలువురు సముదాయించారు. ప్రశ్నించిన మత్స్యకారులపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేసి బయటకి వెళ్లాలని వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. సభ జరిగేటప్పుడు ఎవరూ బయటకు వెళ్లకుండా ముందుగా తలుపులు వేశారు. వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న వారిని బలవంతంగా బయటకు పంపించారు. సభావేదికపై ప్రసంగించిన కొందరు నాయకులు సైతం గతంలో మాదిరి రాయితీలు కావాలంటూ డిమాండు చేశారు. అనతి కాలంలోనే జువ్వలదిన్నె మత్స్య రేవు ప్రారంభమవుతుందని ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా తెలిపారు. మత్స్య కారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంలో వీడియోలు, ఫొటోలు తీయొద్దంటూ విలేకరులపై ఎమ్మెల్యే పీఏ రవి, అనుచరులు రౌడీయిజం చేశారు.