Gadapa Gadapa: 'అప్పుడు ఇస్తే.. మేమేందుకు ఇవ్వాలి..' యువకుడిపై ఎమ్మెల్యే ఫైర్ - పీజు రియంబర్స్మెంట్పై ఎమ్మెల్యేకు నిరసన సెగ
MLA Faced Questions From People : వైసీపీ నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు ఎదురుగాలి తప్పడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పర్యటిస్తుండంగా.. ప్రజలు వారికున్న సమస్యలను వారి ముందు పెడుతున్నారు. ప్రజలు తమ ఇబ్బందులపై వైసీపీ నేతలను నిలదీస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సమస్యలపై ప్రజలు ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న కన్నబాబుపై ఓ విద్యార్థి అమ్మ ఒడి నగదు విషయంలో ప్రశ్నల వర్షం కురిపించగా.. శాసన సభ స్పీకర్‌పై కూడా శ్రీకాకుళం జిల్లాలోని ప్రజలు ప్రశ్నలను సంధించారు. తాజాగా ఎమ్మెల్యే జగన్మోహనరావును కృష్ణా జిల్లాలోని ప్రజలు తమ సమస్యలపై నిలదీశారు.
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం అల్లూరు గ్రామం ఎమ్మెల్యే జగన్మోహనరావు గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంలో అల్లూరులో ఆయన ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించసాగారు. ఈ క్రమంలో గ్రామస్థులు ఆయనను సమస్యలపై నిలదీశారు. పీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని ఎమ్మెల్యేను గ్రామంలోని ఓ యువకుడు ప్రశ్నించగా.. ఎమ్మెల్యే ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీ ఫార్మసీకి రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పామా.. అంటూ ఘాటుగా స్పందించారు. గతంలో ఇచ్చారు కదా.. ఇప్పుడేందుకు ఇవ్వటం లేదని సదరు యవకుడు నిలదీయగా.. అప్పుడు ఇస్తే మేము ఎందుకు ఇవ్వాలంటూ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలా ప్రశ్నించిన ప్రజలపై స్థానిక మండల వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.