Minorities Fire on CM Jagan మైనారిటీల సంక్షేమ పథకాలను రద్దు చేసి, జగన్ మోసం చేశాడు: షరీఫ్ - ముస్లిం మైనార్టీలు టీడీపీకే అండగా ఉంటారు
Legislative Council Former Chairman Sharif Fire on cm Jagan : రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనార్టీలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మైనారిటీ, నూర్ భాషా దూదేకుల ఆత్మీయ సదస్సు సమావేశానికి ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేసి ముస్లిం మైనార్టీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకే సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపారని మండిపడ్డారు. ముస్లిం మైనార్టీల ఓట్లు అడిగే హక్కును జగన్ మోహన్ రెడ్డి కోల్పోయారని తెలిపారు. పేరుకే ఉప ముఖ్యమంత్రి పదవి అంజద్ బాషాకు ఇచ్చి.. 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్న చందంగా ఉందని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు చేసిందేమీ లేదని అసహనం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు టీడీపీకి అండగా ఉంటారని షరీఫ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు హాజరయ్యారు.