Attack on Girl House: వైసీపీ నాయకురాలి మనవడి అరాచకం.. ఫిర్యాదు చేశారని బాధితులపై దాడి - ap news
Minor Girl Complaint on YSRCP Leader GrandSon Attack on Girl House : పోలీసులకు ఫిర్యాదు చేశారన్న కోపంతో మచిలీపట్నంలోని ఓ కాలనీకి చెందిన మైనర్ బాలిక ఇంటిపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఓ కాలనీకి చెందిన మైనర్ బాలికను అదే కాలనీకి చెందిన వైసీపీ నాయకురాలు అంజమ్మ మనవడు పండు గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని బాధిత బాలిక కుటుంబం ఆరోపించింది. దీనిపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన పండు బాధితురాలి ఇంటిపై దాడి చేశాడు. ఈ దాడిలో బాలిక తల్లి తీవ్రంగా గాయపడింది. గాయాల పాలైన ఆమె మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకుడు కొరియర్ శ్రీను బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. దాడి చేసిన వ్యక్తిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసే విషయంలో మొదటి నుంచి పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు గురై నిందితుడిని అరెస్ట్ చేయలేదని అన్నారు. ఫలితంగా ఈ దాడి జరిగిందని కొరియర్ శ్రీను ఆరోపించారు.