Sri Lakshmi Maha Yagnam: రేపటితో ముగియనున్న శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం.. ఐదో రోజు భక్తుల తాకిడి
Sri Lakshmi Maha Yagnam 5th Day: విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం ఐదో రోజు జరిగింది. రేపటితో ఈ యజ్ఞం ముగియనుంది. గత నాలుగు రోజులతో పోలిస్తే ఈ రోజు భక్తుల తాకిడి పెరిగింది. దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రత్యక్షంగా ఈ యజ్ఞంలో పాల్గొంటున్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి యజ్ఞాన్ని తిలకించారు. రుత్వికులు, ఘనాపాటిలు, వేద పండితులచే హోమాలు, అర్చనలు, పూజలను తిలకించారు. బుధవారం ఉదయం 11.38 గంటలకు జరగబోయే పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యజ్ఞ ప్రసాదం, అన్న ప్రసాదం అందించేందుకు మొత్తం 35 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఐదో రోజు నిర్వహించిన సామూహిక లలితా సహస్ర నామ పారాయణానికి విజయవాడ నగరానికి చెందిన మహిళలు పాల్గొన్నారు. చతుర్వేద పారాయణలు, వేదస్వస్తి, గోపూజలు చేశారు. నాలుగు యాగశాలల్లో వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్థంలలో శాస్త్రోక్తంగా 108 కండాలలో విశేష పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు.