Minister Vidudala Rajani చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ ని అనారోగ్యశ్రీ గా మార్చారు: మంత్రి విడదల - తెలుగు వార్తలు
Minister Vidadala Rajini: ఆరోగ్యశ్రీపై బహిరంగ చర్చకు తాము సిద్ధమనీ.. నారా లోకేశ్ బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సవాల్ విసిరారు. గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి రజిని.. కొద్ది రోజులుగా లోకేశ్ ఆరోగ్యశ్రీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలోనే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీని వెంటిలేటర్ పై ఉంచింది చంద్రబాబు ప్రభుత్వమేనని విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీకి ఏడాదిలో వెయ్యి కోట్లు కేటాయించలేదని ఎద్దేవా చేసిన మంత్రి రజిని.. ప్రస్తుతం ఈ ఒక్క ఏడాదికే రూ. 3వేల 400 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. టీడీపీ హయాంలో బీపీఎల్ కుటుంబాలకే ఆరోగ్యశ్రీ వర్తింపజేశారని.. కానీ వైసీపీ ప్రభుత్వంలో రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి కూడా వర్తింపు చేస్తున్నామని చెప్పారు. గతంలో ఆరోగ్యశ్రీ పరిధిలో 919 ఎంపానెల్ ఆస్పత్రులుండగా... వైసీపీ ప్రభుత్వంలో 2 వేల275 ఆస్పత్రులకు పెంచినట్లు మంత్రి రజిని చెప్పారు. గతంలో 1575 మంది రోజూ వైద్యచికిత్సలు పొందగా... ఇప్పుడు 3,400 మంది వైద్యచికిత్సలు పొందుతున్నారని మంత్రి రజిని వెల్లడించారు.