Minister Roja Responded on Chandrababu Arrest: త్వరలో వారిద్దరూ జైలుకే.. మంత్రి రోజా జోస్యం - జబర్దస్త్ రోజా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 12, 2023, 8:29 PM IST
Minister Roja Responded on Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా స్పందించారు. తిరుమలలో వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జైలుకు పోవడంతో మొక్కులు చెల్లించేందుకు వచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు స్కాం (Scam)లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని మంత్రి రోజా (Minister Roja) అన్నారు. త్వరలో లోకేశ్, అచ్చెన్న కూడా జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు.
జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2లక్షల శాశ్వత ఉద్యోగాలు (Jobs) భర్తీ చేశారని రోజా తెలిపారు. 2.60లక్షల మందికి వాలంటీర్లుగా అవకాశాలు కల్పించారని, ఎంఎస్ఎంఈల ద్వారా 12లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ (Nara Lokesh) కూడా జైలు లోపలికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.. అందరూ కూడా రెడీగా ఉండాలని రోజా పేర్కొన్నారు.