కృష్ణానది రక్షణ గోడ నిర్మించిన ఘనత జగన్ ప్రభుత్వానిదే : మంత్రి పెద్దిరెడ్డి - విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 6:27 PM IST
Minister Peddireddy Ramachandra Reddy: విజయవాడలో కృష్ణానది రక్షణ గోడ నిర్మించిన ఘనత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కరకట్టను నిర్మించడానికి ముందుకు రాలేదని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. సీఎం జగన్ విజయవాడపై ప్రత్యేక శ్రద్దతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేశారని పెద్దిరెడ్డి వెల్లడించారు.
విజయవాడ కనకదుర్గ నగర్, అయ్యప్ప నగర్లో కొత్తగా నిర్మించిన మూడు విద్యుత్ సబ్ స్టేషన్లను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్ పద్మా జనార్దనరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలు కేవలం నినాదాలు చేయడం కాదని... తమ అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపాలని మంత్రి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు.