Minister Peddireddy Comments: 'మందకృష్ణ మాదిగ పేమెంట్ మాస్టర్.. ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడుతున్నాడు' - ప్రాజెక్టులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి
Minister Peddireddy Ramachandra Reddy: వేల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు ప్రజల దాహార్తిని తీర్చే ప్రాజెక్టులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తిరుపతి ఎస్వీ వెటర్నరీ ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం - 2023 రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జీవ వైవిధ్య దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. పశుసంవర్థక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి కేసులు వేశారన్నారు. ''మందకృష్ణ మాదిగ పేమెంట్ మాస్టర్.. చంద్రబాబు డబ్బులు ఇస్తే.. ఇక్కడొచ్చి మాట్లాడుతాడు.. అవసరమైతే ఆయన తెలంగాణలో మాట్లాడాలి.. కానీ, అక్కడ ఆ పరిస్థితి లేదు'' అని అన్నారు. రాష్ట్రంలో కరవు ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. చంద్రబాబు తన సొంత జిల్లాలో అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారన్నారు. మచిలీపట్నం పోర్ట్‌కు అన్ని అనుమతులు తీసుకుని ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.