Minister Peddireddy Challenges Chandrababu: రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు సై.. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్ - Chandrababu
Minister Peddireddy Challenges Chandrababu: రాయలసీమ ప్రాజెక్టులపై కుప్పం వేదికగా చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రాజెక్టులు డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు. సొంత జిల్లా చిత్తూరుకు చంద్రబాబు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. రాయలసీమ గురించి దేవుడెరుగు కానీ.. సొంత జిల్లాలో కూడా అడ్డంకులు సృష్టిస్తున్న చంద్రబాబుకు.. రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడేందుకు ఏం నైతిక విలువ ఉందని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. పలమనేరు వరకు వచ్చిన నీటిని కుప్పంకు తీసుకొని వెళ్లలేకపోయారని విమర్శించారు. కుప్పం నియోజకవర్గం మీద ఏ మాత్రం శ్రద్ధ ఉందని నిలదీశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కాలయాపన చేసి.. ఇప్పుడు ఏమో ఆరు నెలలు సమయం ఇస్తే హంద్రినీవా పూర్తి చేస్తామని చెప్తున్నారని దుయ్యబట్టారు. కుప్పంకు రానున్న రెండు నెలల్లో తాగునీరు, సాగునీరు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.