Minister KTR on AP IT Companies: 'ఏపీలో కూడా ఐటీ సంస్థలు పెట్టండి.. జగనన్నకు చెప్పి నేను జాగా ఇప్పిస్తా' - TS Minister KTR news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2023, 3:51 PM IST
Minister KTR on AP IT Companies:తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఐటీ సంస్థలను ఏర్పాటు చేయాలని.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎన్నారైలను కోరారు. కావాలంటే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి స్థలాలు కూడా ఇప్పిస్తానని ఎన్నారైలకు హామీ ఇచ్చారు. బెంగళూరు ఐటీ రంగంలో 40శాతం తెలుగువాళ్లే ఉన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలుగు ఐటీ ఉద్యోగులంతా బెంగళూరు నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న కేటీఆర్.. ఇకనైనా కులం, మతం, ప్రాంతాల పేరుతో కొట్టుకు చావడం మానుకోవాలని పిలుపునిచ్చారు.
KTR Comments:తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, హనుమకొండలో విస్తృతంగా పర్యటించిన మంత్రి కేటీఆర్.. రూ.900 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ..''ఐటీ రంగంలో రాబోయే రోజుల్లో టైర్ 2 నగరాలదే భవిష్యత్. తెలంగాణతో పాటు ఏపీలోనూ ఐటీ సంస్థలు రావాలి. ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని ఎన్నారైలను కోరుతున్నాను. ఎందుకంటే అక్కడి పిల్లలకు కూడా టాలెంట్ ఉంది. నెల్లూరు, భీమవరం లాంటి చోట్ల ఐటీ సంస్థలు పెట్టాలి. కావాలంటే జగనన్నకు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తా. బెంగళూరు ఐటీ రంగంలో 40శాతం తెలుగువాళ్లే ఉన్నారు. వాళ్లంతా బెంగళూరు నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉన్నచోటే మన యువతకు ఉపాధి దక్కాలి. కులం, మతం, ప్రాంతం పేరుతో కొట్టుకుచావడం మానుకోవాలి.'' అని ఆయన అన్నారు.