Minister Kakani on Yuvagalam: ఎలాంటి లక్ష్యం లేకుండానే లోకేశ్ పాదయాత్ర: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి - నెల్లూరు జిల్లా వార్తలు
Minister Kakani on Yuvagalam Padayatra: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో అట్టర్ ప్లాప్ అయిందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప పాదయాత్రలో రెండు, మూడు వేల మంది జనాలు కూడా రాలేదని ఆయన నెల్లూరులో విమర్శించారు. ఎలాంటి లక్ష్యం లేకుండానే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారో, వాకింగ్ చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. ఓ పక్క లోకేశ్ పాదయాత్ర జరుగుతుంటే మరో పక్క చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. కర్ణాటక, వైఎస్సార్సీపీ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పేరు మార్చి చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారని చెప్పారు. గతంలో బీజేపీ విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు పొత్తు కోసం తహతహలాడుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. రాజకీయ నేపథ్యం లేని వారి సవాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్ర పూర్తిగా మూగబోయింది అన్నారు. జిల్లాలో 24 లక్షల మంది జనం ఓటర్లు ఉంటే కనీసం 1శాతం మంది ప్రజలు కుడా పాదయత్రలో పాల్గొనలేదని ఆయన అన్నారు.