Jogi Ramesh: తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఏపీకి వచ్చి చూస్తే అర్థమవుతుంది: జోగి రమేష్
ప్రతీ పేదవాడికి సొంత ఇంటితో గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలన్న.. ప్రభుత్వ సదాశయాన్ని అర్ధం చేసుకుని నిర్దేశించిన లక్ష్యాన్ని బరువుతో కాక బాధ్యతతో.. నెరవేర్చేందుకు పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ అధికారులను ఆదేశించారు. నవరత్నాల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అమలు జరుగుతున్న జగనన్న ఇళ్ళు కార్యక్రమ ప్రగతిపై కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి అజయ్ జైన్, మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మి షా, జిల్లా కలెక్టర్లతో కలిసి అధికారులతో సమీక్షించారు.
జగనన్న ఇళ్ల నిర్మాణం ప్రగతికి చేపడుతున్న చర్యలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను జిల్లాలోని పలువురు శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. తొలుత పోణింగి గ్రామంలో నిర్మిస్తున్న జగనన్న ఇల్లును మంత్రి పరిశీలించారు.. జగనన్న కాలనీల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని ఈ విషయంలో ఆరోపణలు చేసేవారు మాతోవస్తే చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీకి వచ్చి ఇక్కడి ప్రగతిని చూస్తే అర్థమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కలెక్టర్ పాల్గొన్నారు.