Jogi Ramesh fire on Employees: 'ఒళ్లు జాగ్రత్త..' ఉద్యోగులపై మంత్రి జోగి చిందులు
Minister Jogi Ramesh Angry on Employees: జలవనరుల శాఖ ఉద్యోగులపై మంత్రి జోగి రమేష్ చిందులు తొక్కారు. విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. మంత్రితో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు ఢిల్లీరావు, రాజబాబు పాల్గొన్నారు. మంత్రి సమావేశానికి వస్తున్న సమయంలో ఉద్యోగులు సరైన గౌరవం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిని వేదిక మీదకు వస్తుంటే కనీస గౌరవం ఇవ్వాలని తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్ఞానం లేదా అంటూ ఉద్యోగులపై మండిపడ్డారు. ఉద్యోగుల ఒళ్లు జగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరించారు. కింది స్థాయి ఉద్యోగులకు ఏం నేర్పుతున్నారని జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు రేపు కృష్ణా డెల్టాకు 100 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నట్లు జోగి రమేష్ తెలిపారు. కాలువల్లో గుర్రపు డెక్క తొలగించేందుకు టెండర్లు పిలిచామని.. రూ.30 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేస్తామన్నారు. కృష్ణా దిగువన, ఎగువన బ్యారేజ్‌ల నిర్మాణ అంచనాలు సిద్ధమయ్యాయని.. బ్యారేజ్‌ల నిర్మాణ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నట్లు జోగి రమేష్ స్పష్టం చేశారు.