వైసీపీని కాదని టీడీపీకి ఓటేస్తే మీ ఇంటికి ఇక వాలంటీర్ రాడు: మంత్రి ధర్మాన ప్రసాదరావు - Minister Dharmana Prasada Rao Comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 10:46 PM IST
Minister Dharmana Prasada Rao Comments on TDP: కుటుంబమంతా సంతోషంగా ఉండాలని పాటుపడుతున్న వైసీపీని కాకుండా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే.. మీ ఇంటికి ఇక వాలంటీర్ రాడని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఘంటాపథంగా చెప్పారు. దేని కోసం సైకిల్‌కు ఓటు వేస్తారని ధర్మాన ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరపాలకసంస్థ పరిధిలోని పెద్దపాడులో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో.. మంత్రి ధర్మాన పాల్గొన్నారు. గత నాలుగున్నరేళ్లలో.. వైసీపీకి ఓటు వేయలేదని మీకు ఏదైనా పథకాలు ఆపేస్తామని ఎవరైనా అన్నారా అని ప్రశ్నించారు.
కులం, మతం చూడకుండా, పార్టీకి ఓటు వేశారా లేదా అని చూడకుండా.. దేశంలో మొట్ట మొదటిసారిగా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నది.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. ఇంకా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తున్నామని చాలా మంది చెబుతున్నారన్న ధర్మాన.. అది ఒక షాక్‌గా ఉందని అన్నారు. తెలిసీ తెలియకుండా ఓటు వేయకండి అని సూచించారు. తాను ఇక్కడే స్ధిర నివాసం ఏర్పాటు చేసుకున్నానన్న ధర్మాన.. పెద్దపాడు వాడిని ఓడిస్తారా.. గెలిపిస్తారా అనేది మీ ఇష్టమన్నారు.