ప్రభుత్వ చర్చలు విఫలం - మున్సిపల్ కార్మికుల సమ్మె యథాతథం - Minister Botsa comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2024, 10:50 PM IST
|Updated : Jan 7, 2024, 6:16 AM IST
Minister Botsa Satyanarayana Comments: మున్సిపల్ కార్మిక సంఘాలు లేవనెత్తిన అన్ని డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కార్మికుల హెల్త్ అలవెన్స్ రూ.6 వేలు వేతనంలో కలిపి ఇవ్వాలని తాము నిర్ణయించామన్నారు. ఇకపై పరిహారం మొత్తాన్ని కోర్టు ఉత్తర్వుల ప్రకారమే ఇస్తామన్నారు. కార్మికులు ప్రమాదవశాత్తూ చనిపోతే, ఇచ్చే పరిహారాన్ని కూడా పెంచామని మంత్రి బొత్స తెలిపారు.
Botsa on Municipal workers Demands:రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులు గతకొన్ని రోజులుగా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కార్మికులతో రెండు దఫాలుగా చర్చలు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం, శనివారం మరోసారి చర్చలు జరిపింది. ఈసారి జరిగిన చర్చలో మున్సిపల్ కార్మిక సంఘాల అన్ని డిమాండ్లను అంగీకరించామని మంత్రి సత్యనారాయణ తెలిపారు. ''కార్మికుల ప్రమాద పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచాం. మరికొన్ని డిమాండ్లకు కూడా మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలి. తక్షణమే సమ్మె విరమించి, విధుల్లో చేరితే అమలు చేస్తాం. మున్సిపల్ కార్మికులు సమ్మె విరమిస్తే నోటిఫికేషన్ ఇస్తాం. పెంపు అంతా వచ్చే ప్రభుత్వంలోనే ఇస్తామని తేల్చి చెప్పాం'' అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ప్రభుత్వంతో జరిపిన చర్చలు మరోమారు విఫలం అయ్యాయి. 11 అంశాలు పరిష్కరిస్తాం అని మంత్రుల కమిటీ చెబుతోంది. కానీ, అడిగిన ప్రధాన డిమాండ్‌ను మాత్రం పట్టించుకోలేదు. ఆర్థికపరమైన అంశాలు ఏవీ పట్టించుకోలేదు. గ్రాట్యూటీ అడిగాం, ఉద్యోగ విరమణ ప్రయోజనం రూ.50వేలు మాత్రమే ఇస్తారా అని నిలదీశాం. కార్మికులు ఎన్నికల ముందు రాజకీయాలు చేయడం లేదు. మాకు కనీస వేతనం పెంచాలని కోరితే, అది గొంతెమ్మ కోర్కె అవుతుందా ? రెండు నెలల్లో ఓటు అనే ఆయుధంతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం.- ఉమా మహేశ్వరరావు, సీఐటీయూ కార్మిక సంఘం నేత