Minister Botsa Satyanarayana: 'వచ్చే ఏడాదికి.. పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులు పూర్తి' - కోలగట్ల వీరభద్ర స్వామి
Minister Botsa Satyanarayana: ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులను వచ్చే ఏడాది జాతర సమయానికి పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పైడితల్లి అమ్మవారిని.. డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి, ఎమ్మెల్సీలు రఘురాజు, సురేష్, మంత్రి బొత్స దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ విస్తరణ పనులపై దేవాదాయశాఖ అధికారులతో చర్చించారు. అమ్మవారి దర్శనం అనంతరం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మంత్రి బొత్ససత్యనారాయణ పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణపై మాట్లాడుతూ.. ఆలయ విస్తరణకు స్థలాలు ఇచ్చిన వారికి దేవాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వాణిజ్య భవనాలు నిర్మించుకునేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రధాన రోడ్డుకు మరో వైపు.. షాపులు ఏర్పాటు చేసేందుకు కోర్టు కేసు వివాదం పరిష్కారం కావటంతో.. విస్తరణకు మార్గం సుగమమైందని తెలిపారు. దీంతో మాస్టర్ ప్లాన్ ప్రకారం విస్తరణ పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
శంకుస్థాపన మాసోత్సవం: విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో శంకుస్థాపన మాసోత్సవం కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి.. విజయనగరం అభివృద్ధి కోసం వినూత్నంగా శంకుస్థాపనల మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నారని.. మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో నెల రోజుల పాటు.. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు మంత్రి బొత్స తెలియజేశారు. కేవలం శంకుస్థాపనలు చేయటమే కాకుండా.. ప్రారంభించిన పనులను ఆరు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొదించామని అన్నారు.