Minister Botsa Responded on Chiranjeevi Comments: సినీ పరిశ్రమ పిచ్చుక అని చిరంజీవి ఒప్పుకున్నారా..?: మంత్రి బొత్స
Minister Botsa responded on Chiranjeevi comments: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగు చిత్ర పరిశ్రమ అగ్రహీరో, మాజీ రాజ్యసభ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ''సినీ పరిశ్రమ ఒక పిచ్చుక అని చిరంజీవి ఒప్పుకున్నారా..? ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. చిరంజీవి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో చెప్పాలి..? ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందిస్తుంది. చిరంజీవి వ్యాఖ్యలు చూశాక పూర్తి స్థాయిలో నేను స్పందిస్తా. సినీ పరిశ్రమ ఓ పిచ్చుక అని చిరంజీవి అంగీకరిస్తారా..?'' అంటూ బొత్స వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు..మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా అభిమానులు ఓ వేడుకను నిర్వహించారు. ఆ కార్యక్రమానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.''పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడ్డారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టండి. పేదల కడుపు నింపే పథకాలపై దృష్టి పెట్టండి. ప్రజలకు సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టండి. ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలందిస్తే ప్రతి ఒక్కరూ తలవంచి నమస్కరిస్తారు.'' అని చిరంజీవి అన్నారు.
''రానున్న ఎన్నికల్లో తమ పార్టీ (వైఎస్సార్సీపీ)ని అధికారంలోకి రానివ్వనని పవన్ అనుకుంటే అయిపోతుందా..?. విద్య, వైద్యం, సంక్షేమంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు రావాలంటే జన్మభూమి కమిటీలు అంగీకరిస్తేనే పథకాలు వచ్చేవి. నేడు లబ్దిదారులకే ప్రభుత్వం నేరుగా పథకాలు అందిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో యాత్రలు ఎవరైనా చేయొచ్చు. కానీ, యాత్రల పేరుతో చట్టాలను చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటే చూస్తు ఊరుకోం. విశాఖలో పవన్ చేపడుతున్న వారాహి యాత్ర గురించి దేశంలో చర్చ జరుగుతుందని అంటున్నారు. చంద్రబాబు పుంగనూరు యాత్రలాగా విశాఖలో విధ్వంసం చేయాలని చూస్తున్నారా..?.''-బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి