పాట పాడి ఖాళీ కుర్చీలకు జగనన్న గొప్పతనాన్ని వివరించిన మంత్రి - సామాజిక సాధికార బస్సు యాత్ర వీడియోలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 9:49 PM IST
Minister Appalaraju sang a rap song praising Jagan: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో.. వైసీపీ సామాజిక బస్సు యాత్ర అట్టర్ ప్లాప్ అయింది. మంత్రులు మాట్లాడుతున్నప్పుడూ.. కనీసం పదో వంతు కుర్చీల్లోనూ జనం కనిపించలేదు. ఐతే, ఉన్న అరకొర జనాన్ని ఉత్సాహపరిచేందుకు మంత్రి అప్పలరాజు పాట పాడారు. జగన్‌ను కీర్తిస్తూ ర్యాప్ సాంగ్ పాడారు. కాకపోతే మంత్రిగారి పెర్‌ఫార్మెన్స్ పీక్.. ఆడియన్స్ రెస్పాన్స్ వీక్ అంటూ.. అందరూ గుసగుసలాడుకున్నారు.
వైసీపీ నాయకులు ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం ఫొటో లేకుండా ఉండడాన్ని తప్పుపడుతూ... ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. తన ఫొటో లేకుండా ఉన్న ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని.. స్పీకర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసుల సహకారంతో మున్సిపల్ అధికారులు స్పీకర్ లేని ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నం చేశారు. వైసీపీ ఉత్తరాంద్ర ప్రచార బాధ్యుడు చింతాడ రవికుమార్ వచ్చి ఫ్లెక్సీలు తొలగించవద్దని అధికారులను కోరారు. స్పీకర్ లేని ఫ్లెక్సీలు ఉండడం ప్రొటోకాల్ ఉల్లంఘన కిందికి వస్తుందని.. అందుకే తొలగిస్తున్నట్లు తెలిపారు. వెంటనే ఫ్లెక్సీలపై చిన్న స్టిక్కర్లతో కూడిన ఫొటోలు ఏర్పాటు చేయడంతో వివాదం ముగిసింది.