Minister Ambati on BRO Cinema: 'బ్రో' సినిమా డ్యాన్స్‌పై స్పందించిన మంత్రి.. పవన్ కల్యాణ్‌పై వ్యంగ్యాస్త్రాలు - ycp news
Minister Rambabu reacted to the Bro movie dance scene: టాలీవుడ్ యాక్టర్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' సినిమాలో హాస్య నటుడు పృథ్వీరాజ్.. శ్యాంబాబు పాత్రలో చేసిన డ్యాన్స్‌పై రాష్ట్ర రాజకీయల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కావాలనే మంత్రి అంబటి రాంబాబు ఈ ఏడాది భోగి పండుగ రోజున చేసిన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేశారంటూ అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, మంత్రి రాంబాబు అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్ కల్యాణ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే తనను రాజకీయంగా ఎదుర్కోవాలంటూ సవాల్ విసిరారు.
వచ్చే ఏడాది భోగి రోజున మళ్లీ డ్యాన్స్ చేస్తా.. ఈ ఏడాది జనవరి 14వ తేదీన సత్తెనపల్లిలో జరిగిన భోగి మంటల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ వీడియో అప్పట్లో తెగ వైరలయ్యింది. తాజాగా పవన్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధర్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ సినిమాలో మంత్రి అంబటి రాంబాబు భోగి రోజున చేసిన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేస్తూ.. పృథ్వీరాజ్ చేత డ్యాన్స్‌లు వేయించారంటూ విమర్శలు తలెత్తాయి. ఈ ఘటనపై మంత్రి రాంబాబు మాట్లాడుతూ..''రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక సినిమాల్లో క్యారెక్టర్ పెట్టి పవన్ కల్యాణ్ ఆనందపడుతున్నాడు. నేను డ్యాన్స్ వేసిన మాట వాస్తవమే. భోగి పండుగ రోజున సరదాగా ఆనంద తాండవం చేశాను. కానీ, పవన్ కల్యాణ్ శునకానందం పొందే పరిస్థితికి దిగజారిపోయాడు. నేను ఇంకా బ్రో సినిమా చూడలేదు. నామీద కోపం ఉంటే రాజకీయంగా ఎదుర్కో పవన్. అంతేగానీ, నన్ను ఎదుర్కోలేక నీ సినిమాలో ఎవరో డబ్బు ఖర్చు చేస్తే నా క్యారెక్టర్ పెట్టి ఆనందపడుతున్నావా..? వచ్చే ఏడాది భోగి పండగ రోజున మళ్లీ డ్యాన్స్ చేస్తా. నా డ్యాన్స్ సింక్ అవుతుందో లేదో ప్రజలు చూస్తారు. ప్రజలకు నువ్వు (పవన్) సింక్ అవుతావో లేదో అది చూసుకో ముందు''అంటూ మంత్రి అంబటి రాంబాబు పవన్ కల్యాణ్‌పై వ్యంగ్యాస్త్రాలు చేశారు.