Minister Ambati on Bhuvaneshwari Yatra సానుభూతి కోసమే నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర : మంత్రి అంబటి - Ambati Rambabu
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 22, 2023, 7:57 PM IST
Minister Ambati Comments : చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో శాంతియుత ఆందోళనలు కొనసాగిస్తూ.. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న టీడీపీపై మంత్రి అంబటి రాంబాబు నోరుపారేసుకున్నారు. తమ అధినేత జగన్ గతంలో రోజల తరబడి చేపట్టిన ఓదార్పు యాత్రను విస్మరించిన అంబటి... చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) చేపట్టనున్న బస్సు యాత్రను ఉద్దేశించి విమర్శలు చేశారు. జనసేన, టీడీపీ కలిసి వచ్చినా పోరాటానికి తాము సిద్ధమని అంబటి అన్నారు. ఎవరో చనిపోతే.. యాత్ర పేరుతో సానుభూతిని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అంబటి.. నారా భువనేశ్వరి యాత్రను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో సానుభూతి కోసమే భువనేశ్వరి యాత్రకు సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నారు.
లోకేశ్ ఆవేదన సబబే.. చంద్రబాబు అరెస్టు పట్ల కుమారుడిగా లోకేశ్ (Lokesh) ఆవేదన చెందడం సహజమన్న అంబటి.. మునిగిపోతున్న తెలుగు దేశం పార్టీని నడిపేందుకు, కాపాడేందుకు లోకేశ్ విఫలయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయాలు తెలియవన్న అంబటి.. రాజకీయ నాయకుడిగా కాకుండా ఓ వ్యాపారిలా పవన్ జనసేన పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా వచ్చినా... వైసీపీ పోరాటానికి సిద్ధమని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.