'పోలీసులతో నేను మాట్లాడినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే'-కంచికచర్ల ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ - Minister Adimulapu Suresh news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2023, 8:01 PM IST
Minister Adimulapu Suresh Reacted Kanchikacharla Incident:ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో అగ్రకులానికి చెందిన కొంతమంది యువకులు.. దళిత యువకుడైన శ్యామ్‌పై దాడి చేసి, అమానుషంగా ప్రవర్తించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో తనపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఈ కేసులో తాను జోక్యం చేసుకున్నానన్న ఆరోపణల్ని ఖండిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కంచికచర్ల పోలీసులతో తాను మాట్లాడినట్టు నిరూపిస్తే.. దేనికైనా సిద్ధమేనని మంత్రి సవాల్ చేశారు.
Minister Adimulapu Suresh Comments: తాజాగా పాత గొడవల కారణంగా అగ్రకులానికి చెందిన కొంతమంది యువకులు.. కంచికచర్లకు చెెందిన దళిత యువకుడిని కారులో తీసుకెళ్లి, నాలుగు గంటలపాటు నరకం చూపించారు. మంచినీళ్లు అడిగితే రహదారి మధ్యలో కారు ఆపి మూత్రం పోసి అవహేళన చేస్తూ.. అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందిస్తూ..''దళిత యువకుడి శ్యామ్‌పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి.. నాపై వస్తున్న ఆరోపణల్ని ఖండిస్తున్నాను. కంచికచర్ల పోలీసులతో నేను మాట్లాడినట్టు నిరూపిస్తే.. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించారు. దాడి ఘటనలో పార్టీల ప్రస్తావన ముఖ్యం కాదు. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు. తెలుగుదేశం ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తోంది.'' అని మంత్రి సురేష్ ఆరోపించారు.