ఎడతెరిపిలేని వర్షం, వేల ఎకరాల్లో పంట నష్టం - అన్నదాత ఆందోళన - మిగ్‌జాం తుపాను
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 6, 2023, 5:14 PM IST
Michaung Cyclone Effect In Rice Crops: మిగ్‌జాం తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి రైతులు భారీ నష్టం చవిచూశారు. లావేరు, రణస్థలం, సిగడాం, ఎచ్చెర్ల మండలాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షానికి వేల ఎకరాల్లో వరిపంట పూర్తిగా తడిసిపోయిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేతికి అంది వచ్చే సమయానికి వరి పంట తడిసిపోయిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూర్చేందుకు సిద్దంగా ఉన్న వరి కుప్పలు వర్షపు నీటిలో తడుస్తున్నాయి. పలుచోట్ల వరి కుప్పలు తడవ కుండా కాపాడుకునేందుకు బరకాలు కప్పుతున్నారు. ఆయా గ్రామాల్లో నూర్పులు చేపట్టిన చోట్ల ధాన్యాన్ని కొందరు ఇళ్లలో, మరికొందరు పంట పొలాల్లోనే నిల్వ చేస్తున్నారు. వర్షాలకు పంట తడిసి ధాన్యం రంగు మారిపోతే వాటిని ఎవ్వరూ కొనరంటూ రైతులు వాపోతున్నారు. భారీగా వర్షం పడటంతో ఎక్కడికక్కడ వర్షపునీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.