Merchant locked bank ఆ వ్యక్తి చేపట్టిన నిరసనకు.. జనం హడల్! - Strange protest in Srikakulam
Merchant locked the bank in Tekkali శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ చిరువ్యాపారి చేపట్టిన నిరసనకు.. జనం హడలెత్తిపోయారు. పాతబస్టాండు సమీపంలోని కరూర్ వైశ్యాబ్యాంకు గేటుకు సమీపంలో కొబ్బరి బొండాలు అమ్మే ఫుట్ పాత్ వ్యాపారి పేకల కృష్ణ శుక్రవారం సాయంత్రం బ్యాంకుకు తాళం వేశాడు. గేటుకు చైన్ చుట్టి బయట నుంచి తాళం వేయడంతో బ్యాంకు సిబ్బందితో పాటు ఏటీఎంకు వచ్చిన వినియోగదారులు గంటపాటు లోపలే చిక్కుకుపోయారు. బ్యాంకు సిబ్బంది పోలీసు స్టేషన్కు కాల్ చేయడంతో స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో టెక్కలి ఎస్సై రామకృష్ణ అక్కడికి వచ్చి వ్యాపారితో మాట్లాడి తాళాలు తీయించారు.
గతంలో తమకు అక్కడ విద్యుత్తు మీటరుతో కూడిన బడ్డీకొట్టు ఉండేదని, సంబంధిత స్థలానికి పట్టా ఇప్పించాలని బాధితుడు కొన్నేళ్లుగా కోరుతున్నారు. ఈ విషయమై ఓసారి విద్యుత్తు స్తంభం పైకెక్కగా, మరోసారి పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోలు సీసాతో బాధితుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ సమస్యపై టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సైతం శుక్రవారం సంబంధిత స్థలాన్ని పరిశీలించారు. బ్యాంకులోకి వెళ్లే మార్గంలో తోపుడుబండి, సైకిల్ పెడుతున్నారని, కుర్చీలు వేసి బ్యాంకు కార్యకలపాలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్నాడని.. బ్యాంకు సిబ్బంది పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సదరు వ్యక్తితో సంప్రదింపు జరిపి.. సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో.. అందరు ఊపిరి పీల్చుకున్నారు.