ప్రజావ్యతిరేక ప్రభుత్వాలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి - వైసీపీ భూకబ్జాలపై మావోయిస్టుల లేఖ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 2:29 PM IST
Maoists Release letter On YSRCP Land Grabs: వైసీపీ నాయకులు కొనసాగిస్తున్న భూ కబ్జాలపై మావోయిస్టు ఆంధ్ర - ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ లేఖను విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లా అధికార పార్టీ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నరని.. ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో స్థానికులకు ఉద్యోగం కల్పించే జీవో 3 రద్దుకు తమ మద్దతును ఉద్ఘాటించారు. బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చూతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జరిగిన వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ అండగా నిలబడిందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం పోరాటాలు చేస్తున్నాయని గుర్తు చేశారు. మైనింగ్ మాఫియాపై వ్యతిరేకంగా స్థానిక ఆదివాసి ప్రజలు కొనసాగిస్తున్న ప్రజా ఉద్యమాలకు.. మావోయిస్టులు తెలిపిన సంఘీభావాన్ని లేఖలో వివరించారు. రాజ్య హింసకు వ్యతిరేకంగా వాకపల్లి మహిళలు 16 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న పోరాటానికి మావోయిస్టు పార్టీ అండగా నిలిచిందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆనేక ఆందోళనలు జరిగాయన్నారు.
యువతను తమకు అనూకూలంగా మార్చుకోవడం కోసం ఆటల పోటీలు నిర్వహిస్తున్నారని.. ఇందుకోసం వాలీబాల్, క్రికెట్ కిట్లను పంపిణీ చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు, చట్టాలకు.. ఆంధ్ర - ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాయని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చింది. డిసెంబర్ 2వ తేదీ నుంచి 8 వరకు గ్రామగ్రామాన పీఎల్జీఏ వార్షికోత్సవాలను జరుపుకోవాలని లేఖలో కోరారు.