మన్యంలో ఖనిజ తవ్వకాల టెండర్పై మావోయిస్టు లీడర్ అరుణ లేఖ!
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 15, 2023, 10:47 AM IST
Maoist Leader Aruna releases letter on laterite ore mining: ప్రభుత్వ కనుసైగల్లో మైనింగ్ మాఫియా ఏజెన్సీలో తిష్ట వేసిందంటూ.. అనకాపల్లి, అల్లూరి, విశాఖ సీపీఐ (CPI) మావోయిస్టు డివిజన్ కార్యదర్శి అరుణ పేరిట ఓ లేఖ విడుదలైంది. ఓ పక్కన బాక్సైట్ జీవో 97ను రద్దు చేశామని చెబుతూనే.. మరోపక్క ఆదివాసీ సంపదను సామ్రాజ్య వాదులకు దోచిపెట్టేందుకు అడుగులు వేస్తున్నారని లేఖలో మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడులో ఈ నెల 2న లాటరేట్ ఖనిజ తవ్వకాలకు టెండర్ పిలిచారని పేర్కొన్నారు. ఆఖరు తేదీగా 16ను ఖరారు చేశారని వెల్లడించారు. లేట రైట్ టెండర్ అనుమతులు వెంటనే రద్దు చేయాలని లేఖలో ఆమె డిమాండ్ చేశారు. అంతే కాకుండా.. ఏజెన్సీలో జాతీయ రహదారి పేరిట తీసుకున్న వ్యవసాయ భూముల రైతులకు పరిహారం చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ గిరిజన సంపదనంతా.. దోచుకునేందుకు ప్రభుత్వం పూనుకుందని అరుణ లేఖలో మండిపడ్డారు.