Manda Krishna Madiga Comments: సీఎం సొంత నియోజకవర్గంలో దళితులపై దాడులు.. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి - మందకృష్ణ మాదిగ
Manda Krishna Madiga Comments: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా పులివెందుల నియోజకవర్గంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరులో జంజాల కృష్ణయ్య అనే దళితుడిని ఈనెల 13వ తేదీన రాళ్లు, కర్రలతో కొట్టి చంపారని ఆయన గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి కోటి నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగతో కలిసి కలెక్టర్, ఎస్పీలకు వేర్వేరుగా వినతిపత్రం అందజేశారు.
అగ్రవర్ణ కులాలు.. దళితుడి ఇంటిని తగులబెట్టడమే కాకుండా.. గ్రామ బహిష్కరణ చేసి అనంతరం హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికీ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎవరైనా గ్రామంలోకి వెళ్తే.. భయబ్రాంతులకు గురి చేసే విధంగా నిందితుల కుటుంబం వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. నిందుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ముగ్గురు దళితులు హత్యకు గురైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు.